కామెడీ హీరో సునీల్ హీరోగా నటించిన సినిమా ‘భీమవరం బుల్లోడు’. ఈ సినిమా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. సునీల్ సరసన ఎస్తర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి ఉదయ శంకర్ డైరెక్టర్. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ బాబు ఈ సినిమాని నిర్మించాడు. త్వరలో ఈ సినిమా విడుదల కానున్న సందర్భంగా డైరెక్టర్ ఉదయ శంకర్ ఈ సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నాడు..
ప్రశ్న) మీ భీమవరం బుల్లోడు గురించి కాస్త చెప్పండి?
స) భీమవరంలో ఉండే రాంబాబు అనే వ్యక్తి మరో 10 రోజుల్లో చనిపోతాడని తెలియడంతో, తను చనిపోయేలోపు ఏదో చేయాలని అనుకుంటాడు. అందుకే హైదరబాద్ వచ్చి రౌడీలను అంతం చేయాలనుకుంటాడు. అలా రౌడీలతో వైరం పెట్టుకున్న తర్వాత తను చనిపోవడం లేదని తెలుస్తుంది. ఆ తర్వాత అతని లైఫ్ లో ఏం జరిగిందనేదే ఈ సినిమా స్టొరీ. సినిమా ఆద్యంతం కామెడీగా సాగుతుంది. యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చాలా ఫన్నీగా ఉంటాయి.
ప్రశ్న) ఇప్పటివరకూ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ మాత్రమే చేసారు. మొదటి సారి చేసిన పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్ చేసారు. ఈ సినిమా నుంచి ఆడియన్స్ ఏమి ఆశించవచ్చు?
స) నేను చేసిన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ ఉంటూనే సెంటిమెంట్ డోస్ ఎక్కువగా ఉండేది. కానీ ఇందులో సెంటిమెంట్ తక్కువ ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంటుంది. సునీల్ అభిమానులు, అలాగే థియేటర్ కి వచ్చే ప్రేక్షకులు ఏం కోరుకుంటారో అన్నీ ఇందులో ఉంటాయి. ఎంటర్టైన్మెంట్, సునీల్ డాన్సులు ఈ సినిమాకి ప్రధాన హైలైట్ అవుతాయి.
ప్రశ్న) ముందుగా ఈ సినిమాని వెంకటేష్ తో అనుకున్నారు, కానీ చివరికి సునీల్ తో చేసారు. ఎందుకలా?
స) మొదట వెంకటేష్ బాబుకి కథ చెప్పాం, అలాగే ఆయనకి కథ కూడా నచ్చింది. కానీ కథా పరంగా చేజింగ్ లు, రన్నింగ్ లు మరియు యాక్షన్ ఎపిసోడ్స్ కాస్త ఎక్కువ ఉంటాయి. ఫిజికల్ గా కాస్త ఇబ్బంది అవుతుందని ఆయన ప్రాజెక్ట్ కి సున్నితంగా నో చెప్పి, పక్కకి తప్పుకున్నారు. అదే టైంలో ‘పూల రంగడు’ సినిమా చూసి మా సినిమాకి సరిపోతాడని ఎంచుకున్నాం. ఆయన కూడా సింగల్ సిట్టింగ్ లో సబ్జెక్ట్ ఓకే చేసారు. అలాగే మేమనుకున్న పాత్రకి ఆయన పూర్తి న్యాయం చేసారు.
ప్రశ్న) మీ ఆస్థాన బ్యానర్ అధినేత సురేష్ బాబు గురించి చెప్పండి. అలాగే ఆస్థాన బ్యానర్ లో తప్ప బయట సినిమాలు చేయరా?
స) నా కెరీర్ మొదలైనదే సురేష్ ప్రొడక్షన్ లో, అప్పటి నుంచి సురేష్ బాబుతో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయన నాకు నిర్మాతగా కంటే ఒక టెక్నీషియన్ గానే తెలుసు. డబ్బు పెట్టాం అని కాకుండా ప్రతి పనిలోనూ ఇన్వాల్వ్ అవుతారు. ఒక డైరెక్టర్ గా కథ పట్ల నాకు ఎంత క్లారిటీ ఉంటుదో అంతే క్లారిటీ సురేష్ బాబుకి కూడా ఉంటుంది.
ప్రస్తుతం బయటి నుంచి రెండు సినిమా ఆఫర్లు ఉన్నాయి. అయితే సినిమా రిలీజ అయ్యాక నా నిర్ణయం చెప్తానని చెప్పాను. అలాగే ముందు సురేష్ బాబు తో చర్చించి చెయ్యాలా? వద్దా? అనేది కనుక్కున్నాకే బయటి బ్యానర్ లో సినిమా చేస్తాను.
త్వరలో సినిమా విడుదల కానున్న సందర్భంగా డైరెక్టర్ ఉదయశంకర్ మరియు ‘భీమవరం బుల్లోడు’ టీంకి అల్ ది బెస్ట్..